మహా శివరాత్రి శివుడికి సంబంధించిన పండుగలన్నింటిలోనూ చాలా ప్రధానమైనది . మహా శివరాత్రి రోజునే అరుణాచలం లో అగ్నిలింగం ఏర్పడింది అని అంటారు.
ప్రతినెలా కృష్ణ పక్షంలో వచ్చే చతుర్ధశి తిథిని మాస శివరాత్రి అని అంటారు. మాఘ మాసంలోని కృష్ణ పక్షంలో వచ్చే చతుర్ధశికి మాత్రం మహాశివరాత్రి అని అంటారు.
మహాశివరాత్రి రోజున ఉపవాసం, జాగరణ మరియు శివార్చన చేస్తారు. ఇలా చేస్తే పునర్జన్మంటూ ఉండదని శాస్త్ర వాక్కు.
మహాశివరాత్రి శివార్చన
శివరాత్రి రోజున సూర్యోదయానికి ముందుగానే నిద్రలేవాలి. స్నానము సంధ్యాది కార్యక్రమాలు పూర్తి చేసుకోవాలి. తదుపరి ఇంటి లో శివునికి షోడశోపచారాలతో పూజ చేయాలి.
శివభక్తులను పూజించి వారికి భోజనం పెట్టుట శ్రేష్టము. శివాలయానికి వెళ్లి, శివదర్శనం చేసుకోవలెను. అర్ధరాత్రి 12గంటలకు లింగోధ్బవ సమయమున శివునికి అభిషేకం చేయటం చాల శ్రేష్టము.
మహాశివరాత్రి ఉపవాసం
మహాశివరాత్రి ఉపవాసం ఆచరించాలి. ఉపవాస దీక్షలో ప్రధానముగా చేయవలసినది శివుని పూజ, శివనామ స్మరణ. వీటిద్వారా ఈశ్వరునికి దగ్గరగా ఉండుట. శరీరం సహకరిస్తే నిర్జల ఉపవాసం ఉండి శివ స్మరణలో రోజును గడపవలెను. శరీరం సహకరించని యడల స్వల్ప అల్పాహారం, తీసుకొని శివనామ స్మరణలో గడపాలి.
కేవలం ఆహరం విడిచిపెట్టి లౌకిక విషయాలలో మాత్రమే రోజుని గడపడం ఉపవాసము కాదు. ఉపవాసమంటే ఆహారం తీసుకోకుండా శరీరాన్ని బాధపెట్టడం మాత్రమే కాదని వరాహోపనిషత్తు తెలియజేస్తోంది.
అస్వస్థతతో వున్నవారు, గర్భిణీ స్త్రీలు, పిల్లలు, మరియు వృద్దులు ఆహారమును విడిచిపెట్టరాదు. వారు కేవలం శివనామ స్మరణ మరియు శివ పూజ మాత్రమే చేయవలెను.
మహాశివరాత్రి జాగరణ
ఇక మూడోది జాగారం. శివరాత్రి నాటి సూర్యాస్తమయం మొదలు మర్నాడు సూర్యోదయం వరకు-నాలుగు జాములు నిద్రపోకుండా మేల్కొని ఉండటం. ఈ విధంగా జాగారం చేసిన వారికి మళ్లీ పునర్జన్మంటూ ఉండదని స్కాంద పురాణం చెబుతోంది. శివరాత్రి రోజున భగవన్నామ స్మరణం సమస్త పాపాలను నశింపజేస్తుంది. శివరాత్రి నాడు చేసే జాగారాన్ని వ్యర్థ ప్రసంగాలతూనో, ఎటువంటి ప్రయోజనమూ లేని వాటిని చూస్తునో కాకుండా శివనామాన్ని స్మరిస్తూ, పూజ్య గురువులు చేసిన ప్రవచనాలు పార్వతి కళ్యాణం, శివ మహిమలు, పరమ శివుని వైభవం లాంటివి వింటూ, శివగాధలను చదువుకుంటూ శివలీలలను చూస్తూ చేసినట్లైతే కాలాన్ని సద్వినియోగం చేసుకున్నట్లవుతుంది. ఇంకా పుణ్యమూ, పురుషార్థమూ రెండూ దక్కుతాయి.
మహా శివరాత్రి శివ పూజ వలన కలిగిన ఫలితం!
పూర్వం గుణనిధి అనే దుర్మార్గుడు శివరాత్రి నాటి రాత్రి ఆకలితో ఒక శివాలయంలోకి వెళ్లాడు. నైవేద్యం కోసం ఉంచిన అన్నాన్నీ పిండి వంటలనూ కాజేద్దామనుకున్నాడు. తెల్లవార్లూ కునుకులేకుండానే ఉన్నాడు. దీప జ్వాల కొండెక్కుతుంటే వత్తిని ఎగదోశాడు. ఉత్తరీయం అంచును చించి, దారపు పోగులను వత్తిగా చేసి, ఆవునెయ్యిపోసి వెలిగించాడు. ఆ వెలుతురులో అన్నపు గిన్నెను కాజేసి, పరిగెత్తుతూ తలారి వేసిన బాణపు దెబ్బవల్ల మరణించాడు. ఈ పుణ్యానికే ఆ గుణనిధి మరుజన్మలో కళింగ దేశాధిపతియైన అరిందముడికి దముడు అనే కుమారుడిగా జన్మించాడు.
ఆ జన్మలో మహారాజై, అనేక శివాలయాల్లో అఖండ దీపారాధనలు చేయించి, ఆ పుణ్యం వలన ఆ పై జన్మలో కుబేరుడిగా జన్మించి ఉత్తర దిక్పాలకుడైనాడు. ఇలా పరమేశ్వరుడికే ప్రాణసఖుడైనాడని పురణాలు చెబుతున్నాయి. అందుచేత మహాశివరాత్రి రోజున మనం కూడా ముక్కంటిని భక్తి శ్రద్ధలతో పూజించి పుణ్యఫలాల్ని పొందుదాం.
అర్జునుడు చేసిన శివ దండకమును చదువుట కొరకు ఈ లింకు పై క్లిక్ చేయండి.
మీ సలహాలు సూచనలు ఈ క్రింద కామెంట్ రూపంలో తెలుపగలరు.
2 thoughts on “మహాశివరాత్రి ఉపవాసం మరియు జాగరణ”