jandhyala pournami

జంధ్యాల పౌర్ణమి

        శ్రావణ పౌర్ణమికి జంధ్యాల పౌర్ణమి అని, రక్షాబంధన్ అని, ఉపాకర్మ ప్రారంభ రోజు అని  అనేక విశేషాలు ఉన్నాయి.  ప్రతీ ఏటా ఈ రోజున యజ్ఞోపవీతాన్ని మార్చుకుంటారు. యజ్ఞోపవీతం మంటే జంధ్యం, ఇది ధరించినవారికి యజ్ఞం చేయటానికి అధికారమును పొంది ఉన్నాడు అని గుర్తు. 

ఎవరికైతే జంధ్యం  ధరించే నియమం ఉంటుందో  వారు శ్రావణ పౌర్ణమి నాడు విధిగా నూతన యజ్ఞోపవీతాన్ని ధరించాలి.  యజ్ఞోపవీతాన్ని ధరించిన వారు ప్రతినిత్యం సంధ్యావందనం మరియు యజ్ఞం చేయటానికి అధికారమును పొంది ఉంటారు. యజ్ఞం చేయడం వలన దేవతలు ప్రీతి పొందుతారు, దేవతలు చాలా ప్రీతి చెందారు అంటే సకాలంలో వర్షాలు పడతాయి, వర్షాలు సకాలంలో పడటం వలన పంటలు బాగా పండి లోకం సస్యశ్యామలం గా ఉండి అందరూ సంతోషంగా ఉంటారు.

          యజ్ఞం చేయటానికి అధికారం  దేని వలన వస్తుంది అంటే యజ్ఞోపవీతం వలన వస్తుంది, అటువంటి యజ్ఞోపవీతం మలినం అయి ఉండకూడదు. యజ్ఞోపవీతం లో  ఉన్నటువంటి పోగులు  తెగి ఉండకూడదు,  మలినం పట్టి ఉన్న యజ్ఞోపవీతాన్ని తనంతట తాను మార్చక పోయినా, శ్రావణ పౌర్ణమి నాడు తప్పకుండా యజ్ఞోపవీతాన్ని విధిగా మారుస్తారు. 

శ్రావణ పౌర్ణమి నాడు యజ్ఞోపవీతాన్ని మార్చిన తర్వాత, రోజూ కంటే ఎక్కువ గాయత్రి  మంత్రం చెయ్యాలి. ఇలా గాయత్రి మంత్రం శ్రావణ పౌర్ణమి నాడు విశేషంగా  జపం చేయటం వలన  ఆ మంత్ర అధిష్టాన దేవత అయిన గాయత్రీ దేవత అనుగ్రహంతో అన్ని రకముల  ఆయురారోగ్యాలు మరియు ఐశ్వర్యాలను అందరూ పొందుతారు

 శ్రావణ మాసం చాలా ప్రత్యేకమైనది, ఎందుకంటే దక్షిణాయనం మొదలైన తరువాత వచ్చే ఈ శ్రావణ మాసంలో ఎన్నో పండుగలు జరుపుకుంటాము. 

శ్రావణ పూర్ణిమకు ముందుగా, నాగ పంచమి, గరుడ పంచమి, వరలక్ష్మీ వ్రతము, మంగళ గౌరీవ్రతము, వస్తాయి. శ్రావణ పౌర్ణమి రోజున రాఖీ పండుగ, జంధ్యాల పూర్ణిమ జరుపుకుంటాము. 

అలాగే శ్రావణ పౌర్ణమి తరువాత బలరామ జయంతి, శ్రీ కృష్ణాష్టమి పండుగలను జరుపుకుంటాము.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *