Home » శివ దండకం – శ్రీకంఠ లోకేశ
శివ దండకం

శివ దండకమును అర్జునుడు ఎప్పుడు చేశారంటే? 

శివ దండకం వెనుక చాలా విశేషమైన కధ జరిగినది. ఒకానొకప్పుడు వ్యాసభగవానుడు పాండవులతో ఇలా చెబుతాడు పాండవులారా మీరు యుద్దంలో కౌరవులపై గెలవాలంటే శివానుగ్రహం తప్పకుండా ఉండాలి!  కనుక అర్జునుడుని ఇంద్రకీలాద్రి మీద తపస్సు చేయడానికి పంపించండి.

అక్కడ పరమ శివుడ్నిఆరాధన, తపస్సు చేస్తే శంకరుడు ప్రత్యక్షం అయినప్పుడు పాశుపతాస్త్రంను వరంగా అడగాలి. శంకరుడు దానిని ఇచ్చి ఆశీర్వదిస్తే ఇక మీ విజయమునకు తిరుగుండదు అని చెప్తాడు.

అర్జునుడు తపస్సు కొరకై బయలు దేరుట.

అర్జునుడు తన అన్న, తమ్ముళ్ళ దగ్గర సెలవు తీసుకుని బయలుదేరి ఇంద్రకీలాద్రి చేరుకుని కొన్ని సంవత్సరముల శివ ఆరాధన మరియు తపస్సు పూర్తయిన తర్వాత అర్జునుని యొక్క తండ్రి ఇంద్రుడు ఒక వృద్ధ బ్రాహ్మణ వేషంలో వచ్చి యెందుకు ఇంత తపస్సు చేస్తున్నావు, నీకేం కావాలి అని అడుగుతాడు. శంకరుని అనుగ్రహం మరియు నాకు పాశుపతాస్త్రం కావాలి అంటాడు అర్జునుడు.

అందుకు వృద్ధ బ్రాహ్మణ వేషంలో వచ్చిన ఇంద్రుడు నవ్వి శంకరుడు మహాజ్ఞాని ఆయన అనుగ్రహం కలిగితే మోక్షం అడగాలి అంతేగానీ యుద్ధంలో వాడుకోవడానికి పాశుపతాస్త్రమును, ఆశీర్వచనం అడుగుతానంటున్నావు అని అంటాడు.

అందుకు బదులుగా అర్జునుడు నాకేమి కావాలో తెలుసు మా అన్నగారు నన్ను శివానుగ్రహంతో పాశుపతం వారంగా పొందమని నన్ను పంపారు. మా అన్నగారి మాట నిలబెట్టడానికి తపస్సుకు వచ్చాను తప్ప మధ్యలో ఎవరు చెప్పింది చేయడానికి నేను సిద్ధంగా లేనని అంటాడు.

ఇంద్రుడు అర్జునుడు తన ధర్మాన్ని విడిచిపెట్టేసాడా అని పరీక్ష చేస్తాడు. అయినా వెళ్ళకుండా అర్జునుడుని వేధిస్తున్నాడు ఇంద్రుడు. ఇంక నన్నుగాని విసిగించావంటే నీకు తగిన శాస్తి జరుగుతుంది. దయచేసి ఇక్కడనుండి వెళ్లిపొమ్మని అంటాడు అర్జునుడు. ఇంద్రుడు సంతోషించి తన నిజరూపంతో సాక్షాత్కరించి ఇక నుంచి నీవు పార్థివలింగమును పంచాక్షరీ మంత్రముతో తపస్సు చేస్తూ ఆరాధన చెయ్యి నీ ధర్మాన్ని మాత్రం ఎట్టి పరిస్తితులలో మర్చిపోక అని చెప్పి వెళ్తాడు.

శివుడు అర్జునుడిని పరీక్ష చేయుట.

శివుని గూర్చి అర్జునుడు ఘోరమయిన తపస్సు మళ్ళీ మొదలుపెట్టాడు. శంకరుడు అర్జునుడి శక్తిని పరీక్షించాలనుకున్నాడు. మూకాసురుడు అనే ఒక రాక్షసుడిని పిలిచి నీవు ఒక అడవి పందిగా రూపం ధరించి అర్జునుడు తపస్సు చేసుకుంటున్న పర్ణశాల వద్దకు వెళ్ళి పెద్ద రొద చెయ్యి! అని అంటాడు. అది అక్కడికి వెళ్లి పెద్ద చప్పుడు చేస్తోంది. ఆ ధ్వనికి కళ్ళు తెరిచి చూసాడు అర్జునుడు.

వీడెవడో రాక్షసుడయి ఉంటాడు, వీడిని విడిచిపెట్టకూడదు అని ధనుస్సును తీసుకుంటాడు ఈ లోపల శివుడు అర్జునుడికి వెనుకనుంచి అడవి పంది మీదకి బాణం వేస్తాడు.

అది అడవిపంది శరీరంలోకి వెళ్లి నేలమీద కుప్పకూలుతుంది. ఇది శివుడి బాణం. ఆ బాణం తగిలిన వెంటనే అడవిపంది కంగారుగా అర్జునుడి వైపు తిరిగింది. ఇంతలో అర్జునుడు బాణం ఎక్కుపెట్టి అడవిపందిని గురిచూసి కొట్టాడు. అది అడవిపంది శరీరంలోకి వెళ్లి నేలమీద పడిపోయి వెంటనే చచ్చిపోయింది.

శివుడు ప్రమథగణములు ఒకడిని పిలిచి తన బాణమును తీసుకు రమ్మనమని చెప్పాడు. అతను వెళ్లి కలహమును పెంచుకునే ప్రయత్నంగా అర్జునునితో ఈ బాణం మా నాయకుడిది, ఆయన మహానుభావుడు, గొప్ప కిరాతవీరుడు, బాణం తీసాడంటే ఎవరూ నిలబడలేరు, జాగ్రత్త! అని చెప్తాడు.

అర్జునుడు నేనూ బాణం వేసాను, నా బాణానికే ఈ పంది చచ్చిపోయింది, ముందు నేనే ఎక్కుపెట్టాను అని అంటాడు. ఇద్దరి మధ్య వాదం పెరిగి, అర్జునుడు మీ నాయకుడు అంత గొప్ప మొనగాడయితే నాతో యుద్ధమునకు రమ్మనమని చెప్పు అని అంటాడు.

శివుడు అర్జునుడి మధ్య యుద్ధం మరియు శివుని దర్శనం

ఆ మాట అర్జునుడు ఎప్పుడు అంటాడు అని పరమశివుడు ఎదురుచూస్తున్నాడు. వెంటనే శివుడు, అర్జునుడు ఒకరి పైన మరొకరు బాణములు ప్రయోగించుకుంటారు మరియు ద్వంద్వ యుద్ధం కూడా జరుగుతుంది.

అర్జునుడు యొక్క యుద్ద ప్రతిభ మరియు పరాక్రమములు చూసి శివుడు ఆహా ! ఎంతటి మొనగాడివి నువ్వు, ఎంత పౌరుషం నీకు అని యుద్దమును ఆపివేసి శివుడు అర్థనారీశ్వర స్వరూపంతో పార్వతీ పరమేశ్వరులు ఎదురుగుండా ప్రత్యక్షం అవుతారు.  వెంటనే గబగబా అర్జునుడు ఈశ్వరుడి పాదముల మీద పడిపోతాడు. స్వామీ! ఇంత దయ నామీద! నాచేతి దెబ్బలు తిన్నావా! నాతో మల్లయుద్ధం చేశావా తండ్రీ! అని శంకరుని పలువిధముల స్తోత్రం చేసి ఆయన పాదముల మీద పడిపోయాడు.

పరమేశ్వరుడు అర్జునుని చూసి అర్జునా! నన్ను కొట్టానని ఎందుకు బాధ పడతావు? అలా అనుకోవద్దు. దీనిని నీవు నాకు చేసిన పూజగా నేను స్వీకరించాను. నీకేమి కావాలో వరం అడుగు ఇస్తాను అని అన్నాడు. అర్జునుడు శంకరుని ఏమి అడగాలో మర్చిపోయి ఏడుస్తూ ఈశ్వరా! నీవు కంటి ఎదుట కనపడుతున్నావు, తండ్రివయిన నీతో అజ్ఞానినై బాణములు వేసాను యుద్దం చేశాను, నేను కాని పనులు చేస్తే వాటిని పూజ అన్నావా తండ్రీ! నీ కారుణ్యంతో నాగుండె నిండిపోయింది అని పరమేశ్వరుని పాదముల మీద పడిపోయాడు.

శివుడు నీకు పాశుపతాస్త్రమును ఇస్తున్నాను మీకు ఎదురులేదు. రాబోయే కురుక్షేత్రంలో పాండవులు గెలిచి తీరుతారు. విజయీభవ! దీనితో పాటుగా శివలీలగా ఈ కిరాతార్జునీయం ఎక్కడ ఎవరు చెప్పుకున్నా, విన్నా, చదువుకుని బయలుదేరినా, శివదండకమును చదువుకుని బయలుదేరిన వారికి జటిలమయిన సమస్యలు తీరి కార్యసిద్ధి కలుగుగాక! నీకు ఏ విజయం కలుగుతుందో విన్న వారికి, చదివిన వారికి కూడా అటువంటి విజయము కలుగుగాక! అని ఆశీర్వచనం చేస్తాడు.

శ్రీకంఠ లోకేశ లోకోద్భవస్థానసంహారకారీ పురారీ మురారి ప్రియా చంద్రధారీ
మహేంద్రాది బృందారకానందసందోహసంధాయి పుణ్యస్వరూపా

విరూపాక్ష దక్షాధ్వరధ్వంసకా దేవ నీదైవ తత్త్వంబు భేదించి
బుద్ధిం బ్రధానంబు గర్మంబు విజ్ఞాన మధ్యాత్మయోగంబు సర్వ

క్రియాకారణం బంచు నానాప్రకారంబుల్ బుద్ధిమంతుల్ విచారించుచున్
నిన్ను భావింతు రీశాన సర్వేశ్వరా శర్వ సర్వజ్ఞ సర్వాత్మకా నిర్వికల్ప

ప్రభావా భవానీపతీ నీవు లోకత్రయీవర్తనంబున్ మహీవాయుఖాత్మాగ్ని
సోమార్కతోయంబులం జేసి కావించి సంసారచక్ర క్రియాయంత్రవాహుండవై

తాదిదేవా మహాదేవ నిత్యంబు నత్యంతయోగస్థితిన్ నిర్మలజ్ఞానదీప
ప్రభాజాల విధ్వస్త నిస్సార సంసార మాయాంధకారుల్ జితక్రోధ

రాగాదిదోషుల్ యతాత్ముల్ యతీంద్రుల్ భవత్పాద పంకేరుహధ్యాన
పీయూష ధారానుభూతిన్ సదాతృప్తులై నిత్యులై రవ్య యాభవ్య సేవ్యాభవా

భర్గ భట్టారకా భార్గవాగస్త్యకుత్సాది నానామునిస్తోత్రదత్తావధానా
లలాటేక్షణోగ్రాగ్నిభస్మీకృతానంగ భస్మానులిప్తాంగ గంగాధరా నీ

ప్రసాదంబున్ సర్వగీర్వాణగంధర్వులున్ సిద్ధసాధ్యోరగేంద్రా సురేంద్రాదులున్
శాశ్వతైశ్వర్య సంప్రాప్తులై రీశ్వరా విశ్వకర్తా సురాభ్యర్చితా నాకు

నభ్యర్థితంబుల్ ప్రసాదింపు కారుణ్యమూర్తీ త్రిలోకైకనాథా
నమస్తే నమస్తే నమః.

ఇది అర్జునుడు శివుని పై చేసిన స్తోత్రం.

మీ సలహాలు సూచనలు ఈ క్రింది కామెంట్ రూపంలో తెలుపగలరు.


3 thoughts on “శివ దండకం – శ్రీకంఠ లోకేశ

  1. శివ రాత్రి పర్వదినాన శివ దండకం చదివే అవకాశం కలిగింది. అందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదాలు.
    ఓం నమః శివాయ హర హర మహా దేవ శంభోశంకర.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page