భీష్మాష్టమి ఎప్పుడు వస్తుంది?
ప్రతి సంవత్సరం రథ సప్తమి మరుసటి రోజున భీష్మ అష్టమి అనుసరించవలసి ఉంటుంది. ఈ రోజున ప్రతి ఒక్కరు మూడు దోసిళ్ళ అర్ఘ్యం భీష్మ ప్రీతికి ఇవ్వవలసి వుంటుంది. దీనినే భీష్మ తర్పణం అని కూడా అంటారు. అయితే ఈ సంవత్సరం రథ సప్తమి మరియు భీష్మ అష్టమి ఒకే రోజు రావటం గమనార్హం. అయితే అష్టమి తిధి మాత్రం జనవరి 28 శనివారం రోజున సమయం ఉ. 08.43 గం నుండి ప్రారంభమై జనవరి 29 ఆదివారం సమయం ఉ. 09.45 గం వరకు ఉంటుంది. 2023 వ సంవత్సరం జనవరి 28 శనివారం రోజున సమయం ఉ. 11.30 గం నుండి మ. 01.39 గం వరకు భీష్మ తర్పణం ఇవ్వటానికి అనువైన సమయం.
భీష్మ తర్పణం ఎందుకు ఇవ్వాలి?
భీష్ముడు ఆజన్మాంతం నైష్టిక బ్రహ్మచారిగా సత్యధర్మములకు కట్టుబడి జీవించినాడు, చిట్ట చివర శ్రీకృష్ణుని సన్నిధిలో శరీరాన్ని విడిచిపెట్టి ముక్తిని పొందిన మహానుబావుడు. అయితే ప్రతీ ఒక్కరూ భీష్మ అష్టమి రోజున భీష్మ తర్పణం కచ్చితముగా ఇవ్వాలి. అయితే ఇక్కడ అందరికి ఒక సంశయం వస్తుంది. తర్పణాదులు తండ్రి లేని వారికి కదా? మనకు ఎందుకు? అని. కానీ ధర్మ శాస్త్రం ప్రకారం భీష్మ తర్పణం మరియు యమ తర్పణం తండ్రి బతికి వున్నవాళ్ళు కూడా చేయవలసిందే ఇది ప్రతి ఒక్కరి కర్తవ్యం. రథ సప్తమి నాడు స్నానం ఆచరించడం వల్ల మనకు ఏడేడు జన్మలలో చేసిన పాపములు తొలగిపోతాయి. ఆ శుద్ధమైన ఆత్మతో మనము భీష్మ పితామహునికి అర్ఘ్యం ఇవ్వవలసి వుంటుంది.
సమయం మరియు రోజు :
2023 వ సంవత్సరం జనవరి 28 శనివారం.
అష్టమి తిధి మొదలు 28 శనివారం రోజున సమయం ఉ. 08.43 గం నుండి
29 ఆదివారం సమయం ఉ. 09.45 గం వరకు వుంటుంది.
28 శనివారం సమయం ఉ. 11.30 గం నుండి మ. 01.39 గం వరకు భీష్మ తర్పణం ఇవ్వటానికి అనువైన సమయం.
తర్పణం ఎలా ఇవ్వాలి?
మగవారు మాత్రమే ఈ క్రింది తెలిపిన ప్రతీ శ్లోకం చదువుతూ భీష్మునికి తర్పణం ఇవ్వాలి. ఆడవారు ఈ కార్యక్రమాన్ని చేయరాదు. ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి చక్కగా ఇల్లంతా పూలతో అలంకరణ చేసి మరియు నిత్యపూజలు చేసిన తరువాత మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఇంటిలోని పూజ మందిరం దగ్గర గాని ఇంటి ఆవరణలోని యెక్కడైనా దక్షిణం వైపుకి కూర్చుని ఆచమనము తదుపరి ప్రాణాయామము చేసి ఈ విధంగా సకల్పం చెప్పాలి. ” పూర్వోక్త ఏవంగుణ విషేషణ విషిష్ఠయాం శుభతిధౌ శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం మాఘ శుక్లాష్టమ్యాం భీష్మ తర్పణార్ఘ్హ్యం కరిష్యే!”
తదుపరి కొన్ని నీళ్ళు దోసిట్లోకి తీసుకొని ఈ క్రింది తెలిపిన ప్రతీ శ్లోకం చదువుతూ అర్ఘ్యమీయాలి.
1. భీష్మః శాన్తనవో వీరః: సత్యవాది జితే౦ద్రియః!
ఆభిరద్భిరవాప్నోతు పుత్ర పౌత్రోచితా౦ క్రియామ్!! (దోసిట్లో నీళ్ళు విడిచిపెట్టాలి)
2. వైయాఘ్ర పధ్య గోత్రాయ సా౦కృత్య ప్రవరాయచ!
అపుత్రాయ దదామ్యేతత్ ఉదక భీష్మ వర్మణే!! (దోసిట్లో నీళ్ళు విడిచిపెట్టాలి)
3. వసూనామవతారాయ శంతనోరాత్మజాయచ!
అర్ఘ్యం దదామి భీష్మాయ ఆబాల బ్రహ్మచారిణే!! (దోసిట్లో నీళ్ళు విడిచిపెట్టాలి)
తర్పణం ఫలితం :
సశాస్త్రీయంగా ఎవరైతే భీష్మునికి తర్పణం విడిచిపెడతారో వారికి ఎటువంటి దోషములు వున్నా అన్నీ తొలగిపోయి చక్కని సంతానం కలుగుతుంది అని శాస్త్రప్రమాణం.