గర్భరక్షాంబికా దేవి ఎవరు
గర్భరక్షాంబికా దేవి, సాక్షాత్ ఆ జగన్మాత అయినటువంటి పార్వతీదేవి. భక్తుల గర్భములో ఉన్న దోషాలను తొలగించి, వారికి సంతానాన్ని కలిగించే తల్లి. సంతానం లేక బాధపడుతున్నవారు, గర్భవతులు, పిల్లల తల్లులు ఈవిడని పూజిస్తారు. అమ్మవారి యొక్క అనుగ్రహం వలన, సంతానానికి సంబంధించిన సమస్యలు తొలగుతాయి అని పెద్దలు చెబుతారు.
గర్భ రక్షాంబికా దేవి ఆలయం
గర్భ రక్షాంబికా దేవాలయం తిరుకరుకావుర్ అనే ఊర్లో ఉంది. తిరుకరుకావుర్, తమిళనాడు రాష్ట్రంలోని, తంజావూరు జిల్లాలోని, పాపనాశనం తాలూకాలో ఉంది. తంజావూరు లేదా కుంభకోణం నుండి ఒక ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఈ దేవాలయం కలదు.
ఈ దేవాలయాన్ని దర్శించుకోవాలి అనుకునేవాళ్ళు ముందుగా తంజావూరు లేదా కుంభకోణం చేరుకోవాలి. అక్కడి నుండి మనకి అనేకమైన బస్సులు సదుపాయం కలదు.
గర్భరక్షాంబికా అమ్మవారి పూజా విధానం
సంతాన సమస్యలు ఉన్నవారు:
సంతాన సమస్య ఉన్న దంపతులు ఈ గుడి లో 11 ఆవునెయ్యి దీపాలు వెలిగించాలి. గుడిలో గడపలకు పూజ చేసి అమ్మవారిని ప్రార్థించాలి. గుడిలో ఇవ్వబడిన ఆవునెయ్యిని ప్రసాదంగా స్వీకరించి ఇంటికి తీసుకువెళ్లాలి. వారి ఇంటికి వెళ్ళాక 48 రోజులపాటు పడుకునే ముందు ఒక స్పూన్ ఆవునెయ్యిని ప్రసాదంగా ఇద్దరూ తినాలి.
గర్భవతులకు సుఖప్రసవం కోసం:
సుఖ ప్రసవం మరియు ఆరోగ్యవంతమైన బిడ్డ కోసం ఆముదం నూనెను ఇక్కడ ప్రసాదంగా ఇస్తారు. దీనిని గర్భవతి అయిన స్త్రీ కానీ లేదా వారి కుటుంబ సభ్యులు కానీ వచ్చి ఈ ప్రసాదాన్ని తీసుకోవచ్చు. ఈ ఆముదం నూనెను ఏడో నెల తర్వాత నుండి ఆ గర్భిణీ యొక్క కింద నడుముకు రాయాలి. గర్భరక్షాంబికా దేవి స్తోత్రాన్ని చదువుతూ ఈ ఆముదం నూనె రాయడం చాలా మంచిది. ఇలా చేయడం వల్ల సుఖప్రసవం కలిగి తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఉంటారు.
ఈ గుడికి వెళ్లడానికి అవని వారు ఆన్లైన్లో డబ్బులు చెల్లించి అమ్మవారి ప్రసాదాన్ని పొందగలరు. దాని కొరకు ఈ దేవాలయం యొక్క అఫీషియల్ వెబ్ సైట్ లింక్ ని క్లిక్ చేయండి.
గర్భ రక్షాంబికా దేవి చరిత్ర
పూర్వకాలంలో మల్లవనం (మల్లెల వనము) అనే ప్రాంతంలో గౌతమ, గార్గేయ మహర్షులు తపస్సును ఆచరించేవారు. ఈ మహర్షులను నిధ్రువ, వెదికాయి అనే దంపతులు సేవించేవారు. వారి సంతాన సమస్య గురించి మహర్షులకు చెప్పారు. అప్పుడు మహర్షులు వీరిని గర్భరక్షాంబికా దేవిని ప్రార్థించమని చెప్పారు. వీరు ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మవారిని ప్రార్థించగా, వెదికాయి గర్భాన్ని ధరించింది.
ఇలా ఉండగా, ఒక నాడు ఊర్ధ్వపాద మహర్షి వీరి ఇంటికి వచ్చారు. మహర్షి వెదికాయిని పిలిచారు. కానీ గర్భావస్థ వలన ఆవిడకు ఆయన మాటలు వినపడలేదు. అది గ్రహించని మహర్షి ఆవిడ గర్వముతో ప్రతి స్పందించలేదని తలచి గర్భస్రావం అవుతుందని శపించారు.
గర్భస్రావం అవుతుందన్న విషయాన్ని గ్రహించిన వెదికాయి ఎంతో దుఃఖము తో గర్భరక్షాంబికా దేవి ప్రార్థించింది. అప్పుడు ఆ దేవి, ప్రత్యక్షమై ఆ పిండమును కాపాడి ఒక కుండలో ఉంచింది. ఆ పిండము కుండలోనే తన అనుగ్రహం వలన మగ బిడ్డగా మారింది.
నైదురువన్ కు తల్లిపాలు లేవు అప్పుడు అమ్మవారిని ప్రార్థించగా ఆవిడ కామధేనువును పంపింది. ఆ కామదేనువు ఆలయం ముందే తన కాలితో భూమిని తవ్వింది. అప్పుడు ఒక పాల కుండ ఒకటి ఏర్పడింది. దానినే ఇప్పటికీ క్షీరకుండము అని పిలుస్తారు.
ఇప్పుడు ఆ మల్లవనం అన్న ప్రాంతానికే తిరుకరుకావుర్ అనే పేరు వచ్చింది. ఇప్పటికీ కూడా ఆ ప్రాంతంలో మల్లె తీగలు అల్లుకొని ఉండడం మనం గమనించవచ్చు.
good infermation
Thank you Sir