వరలక్ష్మి వ్రత కథ చదివిన వినిన వరలక్ష్మీ వ్రతం సంపూర్ణం అవుతుంది. మనకి వరలక్ష్మి వ్రత కథ లోనే మహర్షి వరలక్ష్మీ వ్రత విధానం గురించి వ్రతకల్పం ఏ విధంగా చేయాలో ఆ విశేషాలు అన్ని వివరించారు. ఈ సంవత్సరం వరలక్ష్మి వ్రతానికి , కింద ఉన్న వరలక్ష్మీ వ్రత కథను చదివి మీరు మీ కుటుంబ సభ్యులు ఆ వరలక్ష్మి దేవి ఆశీస్సులు పొందాలని ఆకాంక్షిస్తున్నానుము.
వరలక్ష్మీ వ్రత కథ
సూతమహాముని శౌనకాది మహర్షులను చూసి ఇలా చెప్పారు. మహర్షులారా, స్త్రీలకు సకల సౌభాగ్యములు సిరిసంపదలు, ఇచ్చే వ్రతము ఒక్కటి సాక్షాత్ ఆ పరమేశ్వరుడే పార్వతీదేవితో చెప్పారు. ఆ వ్రతము గురించి మీకు వివరిస్తాను వినండి.
వరలక్ష్మీ వ్రతం గురించి పరమేశ్వరుడు పార్వతీదేవికి వివరించుట
కైలాస పర్వతమున ఆ పరమేశ్వరుడు కూర్చొని ఉండగా, పార్వతీదేవి వచ్చి స్వామికి నమస్కరించి ఇలా అడిగెను. దేవా! లోకములో ఏ వ్రతము చేసిన స్త్రీలందరికీ సకల సౌభాగ్యాలు పుత్రపౌత్రాదులను సిరిసంపదలు కలుగుతాయో నాకు చెప్పగలరు అని ప్రార్ధించెను. అప్పుడు ఆ పరమేశ్వరుడు ఇట్లు పలికెను. దేవి! స్త్రీలకు సకల సౌభాగ్యములు కలగజేసే వ్రతం ఒకటి ఉన్నది అదే వరలక్ష్మిదేవి వ్రతం.
ఆ వ్రతమును శ్రావణ మాసంలో శుక్ల పక్షం లో వచ్చే పౌర్ణమి తిధి ముందు వచ్చే శుక్రవారం రోజున చేయవలెను అని చెప్పగా, పార్వతిదేవి ఇట్లు అడిగెను. ఓ లోకరక్షక! ఈ వ్రతమును ఎలా చేయవలెను? వరలక్ష్మి వ్రత విధానము ఏమిటి? ఏ దేవతను ఆరాధించవలెను? ఇతః పూర్వము ఈ వ్రతమును ఎవరైనా ఆచరించారా దీని గురించి నాకు వివరించగలరు అని ప్రార్ధించెను.
అప్పుడు పరమేశ్వరుడు పార్వతీదేవిని చూసి ఓ కామాక్షి! వరలక్ష్మీ వ్రతం గురించి సవిస్తరముగా చెబుతాను వినుము. పూర్వము మగధ దేశమున కుండినంబమన్నే పట్టణం ఉన్నది. ఆ పట్టణము బంగారు ప్రాకారములు తోనూ బంగారు గోడలు కలిగిన ఇళ్లలోనూ ఉండేది.
చారుమతి వృత్తాంతం:
ఆ పట్టణము నందున చారుమతి అనే బ్రాహ్మణ స్త్రీ ఉండేది. ఆ వనితామణి భర్తను దైవముగా భావించి పూజించేది. రోజు తెల్లవారుజామునే లేచి స్నానమాచరించి పూజాది కార్యక్రమాలు చేసి, అత్తమామలకు అనేక సేవలు చేసి, ఇంటి పనులు చేసుకుని, మితముగా ప్రియముగా మాట్లాడుతూ అందరితో సఖ్యముగా ఉండేది. ఇటువంటి గుణములు ఉన్న చారుమతి యందు, వరలక్ష్మీ దేవి యొక్క అనుగ్రహం కలిగింది.
ఒక నాడు చారుమతి స్వప్నము నందు వరలక్ష్మీదేవి కనిపించి ఇట్లు పలికెను. ఓ చారుమతీ! నేను వరలక్ష్మీ దేవిని, నీ యందు నాకు అనుగ్రహం కలిగి ప్రత్యక్ష మైతిని. నీవు శ్రావణ శుక్లపక్ష పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం రోజున నన్ను పూజిస్తే నీకు నీ వారికి సకల సౌభాగ్యాలు సిరి సంపదలు కలుగుతాయి, అని పలకగా, చారుమతి ఆ స్వప్నం లోనే వరలక్ష్మీదేవి చుట్టూ ప్రదక్షిణ నమస్కారము చేస్తూ ప్రార్ధించెను.
శ్లో!! నమస్తే సర్వలోకానాం, జనన్యై పుణ్య మూర్తయే!
శరణ్య త్రిజగద్వంద్వే విష్ణు వక్షస్థలాలయ్యే !!
అనేక విధములుగా స్తోత్రము చేసి ఓ జగజ్జననీ! నీ కటాక్షంబు కలిగిన జనులు విద్వాంసులను, సకల భాగ్యాలు పొందుతారు. నేను పూర్వజన్మలో చేసుకున్న ఏ పుణ్యఫలము వలనో మీ దర్శన భాగ్యం నాకు కలిగినది అని ప్రార్ధించెను. అంతట వరములిచ్చి వరలక్ష్మీదేవి అంతర్ధానం అవగా, చారుమతికి మెలకువ వచ్చెను. తన చుట్టూ చూసుకొని అది స్వప్నమని తెలుసుకొని, భర్తకు అత్తమామలకు తనకు వచ్చిన స్వప్నం గురించి వివరించెను. వారు ఎంతో సంతోషించి, శ్రావణమాసం లో ఈ వ్రతమును తప్పక చేద్దామని చెప్పారు. చారుమతి స్వప్న గురించి తెలుసుకున్న ఇతర స్త్రీలు కూడా శ్రావణ మాసం ఎప్పుడు వస్తుందా ఈ వ్రతమును ఎప్పుడు చేద్దామా అని ఎదురు చూశారు.
వరలక్ష్మీ వ్రతము చారుమతి మరియు ఇతర స్త్రీలు చేయుట:
ఇలా ఉండగా వీరి భాగ్యము వలన శ్రావణ మాస శుక్లపక్ష పూర్ణిమ ముందు శుక్రవారం వచ్చింది. అంతట చారుమతి మరియు ఇతర స్త్రీలు ఈ రోజే కదా వరలక్ష్మీదేవి వ్రతము చేయమని చెప్పినది అనుకొని ఆరోజు తెల్లవారుజామునే లేచి తలస్నానము చేసుకొని శుభ్రమైన వస్త్రములను ధరించి చారుమతి యొక్క గృహములో ఈశాన్యం మూలన గోమయంతో అలికి, మండపము ఒకటి ఏర్పాటు చేసి దానిపైన కొత్త బియ్యమును పోసి మర్రి చిగుళ్లు పంచపల్లవాలతో (బిల్వ, తులసి, వేప, రావి, మామిడి ) కలశమును ఏర్పాటు చేశారు. అందులోనికి వరలక్ష్మీ దేవిని ఆవాహన చేసి, చారుమతి మొదలగు స్త్రీలందరూ మిక్కిలి భక్తి శ్రద్ధలతో సాయంకాలమున
శ్లో!! పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే!
నారాయణ ప్రియే దేవి సుప్రీతా భవసర్వదా!!
అనిన శ్లోకము చెప్పి ధ్యాన ఆవాహనాది షోడశోపచార ములతో అమ్మవారిని పూజించి, తొమ్మిది సూత్రములు కలిగిన తోరంబును వారి కుడిచేతికి కట్టుకొని, వరలక్ష్మీ దేవికి అనేక విధమైన నైవేద్యాలను సమర్పించి ఆ మంటపము చుట్టూ ప్రదక్షిణ చేశారు.
మొదటి ప్రదక్షిణ ముగియగానే వారి కాళ్ళ యందు గళ్ళు గళ్ళు మంటూ మంజీరములు మరియు ఇతర ఆభరణములు ప్రత్యక్షమయ్యాయి. వారు మిక్కిలి సంతోషించి రెండో ప్రదక్షిణ చేయగానే వారి చేతులకు నవరత్నాలతో కూడిన బంగారు హస్తాభరణములు ప్రత్యక్షమయ్యాయి. వారు మరింత ఉత్సాహంతో మూడో ప్రదక్షిణ పూర్తి చేయగా వారు సర్వాభరణ అలంకృత లయ్యారు. అంతట చారుమతి మొదలైన స్త్రీల ఇళ్లలో సర్వాభరణములు రధ గజ తురగ వాహనములు నిండి యుండెను. ఆ స్త్రీలందరినీ తీసుకు వెళ్ళుటకు వారి వారి ఇళ్ల నుండి రథములు గుఱ్ఱములు వచ్చి చారుమతి ఇంటి దగ్గర ఉండెను.
అప్పుడు చారుమతి మరియు ఇతర స్త్రీలు ఈ వ్రతమును కల్పోక్త ముగా తమతో చేయించినా బ్రాహ్మణులకు గంధ పుష్పాలతో పూజించి 12 ఉండ్రాళ్ళను దక్షిణ తాంబూలాదులను ఇచ్చి నమస్కరించి ఆ బ్రాహ్మణుని ఆశీర్వాదము పొంది, ఆ వరలక్ష్మీదేవికి నివేదించిన నైవేద్యమును బంధుమిత్రుల తో కలసి భుజించి నారు.
పిదప వారి కొరకు వచ్చిన వాహనములను ఎక్కి వారి ఇళ్లకు వెళుతూ ఒకరితో ఒకరు ఓహో! చారుమతీదేవి ఎంతటి భాగ్య వంతురాలు కదా, సాక్షాత్ ఆ వరలక్ష్మి దేవియే ఆవిడ స్వప్నంలో కొచ్చి ఈ వ్రతము గురించి చెప్పినది అని చారుమతిని మిక్కిలి కొనియాడుతూ వారు ఇళ్లకు చేరినారు. అప్పటినుండి చారుమతి మరియు ఇతర స్త్రీలు ప్రతియేటా ఆ వరలక్ష్మీదేవి వ్రతమును చేస్తూ అష్ట ఐశ్వర్యములతో భోగ భాగ్యాలతో తులతూగుతూ ఉన్నారు.
కావున ఓ పార్వతీ! ఈ వ్రతమును నాలుగు వర్ణముల వారు చేయవచ్చును. అలా చేసినచో వారికి సకల సుఖములు సౌభాగ్యములు ఆ వరలక్ష్మిదేవి యొక్క అనుగ్రహముతో కలుగుతాయి. ఈ కథని ఎవరైతే వింటారో చదువుతారో వారికి ఆ వరలక్ష్మీదేవి అనుగ్రహం వలన సకల కార్యాలు సిద్ధిస్తాయి.
2 thoughts on “వరలక్ష్మీ వ్రత కథ”