
ఈ రోజున ఏ ఏ పనులు చేయాలి?
పుట్టిన రోజు ఎలా జరుపుకోవాలి అనేది, మనకు శాస్త్రం ఒక విధిని నిర్ణయం చేసింది. మన సంస్కృతి, సంప్రదాయాలలో తప్పకుండా గుర్తుపెట్టుకుని చేసుకోవాలసినది జన్మదినం ఒకటి. నేను నా పుట్టినరోజును జరుపుకోను అని అనకూడదు. ఖచ్చితంగా జరుపుకుని తీరాలి!
పుట్టిన రోజును ఎలా పడితే అలా జరుపుకోకూడదు. ఆ రోజున తెల్లవారు జాము నిద్ర లేచి అభ్యంగన స్నానం చేయాలి. అంటే ఒంటికి నూనే వ్రాసుకుంటే అలక్ష్మి తొలగిపోతుంది. కాబట్టి ఒంటినిండా నూనె వ్రాసుకుని తల స్నానం చేయాలి.
తల స్నానం చేసే ముందు పెద్దవాళ్ళు తల పైన నూనెపెట్టి ఆశీర్వచనం చేస్తారు. స్నానం ముగించుకున్న తరువాత కుల దైవాన్ని మరియు ఇష్ట దైవాన్ని ఆరాధన చేయాలి.
తదుపరి ఆవు పాలలో బెల్లం ముక్క, నల్ల నువ్వులు ఈ మూడు బాగా కలపాలి. ఈ కలిపిన మిశ్రమాన్ని తూర్పు వైపుకి తిరిగి కొద్దిగా చేతి లోనికి తీసుకొని తినాలి. ఇలా మూడు సార్లు తినాలి. తినేటప్పుడు మాట్లాడకూడదు, మౌనంగా తినాలి
ఆవు పాలలో బెల్లం ముక్క, నల్ల నువ్వులు కలిపిన మిశ్రమాన్ని తీసుకుంటే వచ్చే సంవత్సరం పుట్టిన రోజుకి ఎటువంటి గండములు ఉన్నా అన్నీ తొలగిపోతాయి మరియు అప మృత్యు దోషం కబాళించకుండా కాపాడుతుంది అని పెద్దలు అంటారు.
తరువాత సప్త చిరంజీవులు అయిన అశ్వత్థామ, బలి, వ్యాసుడు, హనుమంతుడు, విభీషణుడు, కృపాచార్యుడు మరియు పరశురాముడు ఈ 07 పేర్లు మనసులో నైనా చెప్పాలి లేక పైకి అయిన చెప్పాలి.
వీరిని పుట్టుకతోనే చిరంజీవులు అని అంటారు. వీరిని తలచు కోవడం వలన దీర్ఘాయుష్మాన్తులు అవుతారు. అని పెద్దలు చెబుతారు.
దీనిని శ్లోక రూపం లో ఇలా చెబుతారు.
అశ్వత్థామా బలిర్వ్యాసో హనుమాంశ్చ విభీషణః।
కృపః పరశురామశ్చ సప్త ఏతైః చిరంజీవినః ॥
ఆ రోజున తల్లి తండ్రులకు గురువులకు మరియు పెద్దలకు నమస్కారం చేసి ఆశీర్వచనం అందుకోవాలి. ఇంటికి దగ్గర్లో వున్నశివాలయం, హనుమ ఆలయం ఇలా మీ ఇష్టమైన గుడికి వెళ్ళి మీ పేరు మీద పూజ చేయించుకోవాలి. ఈశ్వర అర్చన కూడా చేయాలి.
పుట్టిన రోజున మాత్రం బ్రహ్మచర్యాన్ని పాటించాలి. మంచి భోజనం చేయాలి. చెడు కార్యక్రమాలకు దూరంగా ఉండాలి.
తనకున్న శక్తి కొలది దాన ధర్మాలు నిర్వహించాలి. దానాలు చేయలేని యడల గో గ్రాసం అంటే చేతి నిండా పచ్చ గడ్డిని తీసుకుని గోవుకి చక్కగా తినిపించి గోవు చుట్టూ ప్రదక్షిణలు చేయాలి.
ఇలా పుట్టిన రోజు వేడుకలు చేయమని శాస్త్రం విధిని నిర్ణయం చేసింది. వీటన్నింటికీ విరుద్ధంగా మాత్రం పుట్టిన రోజు చేసుకోకూడదు!
అన్నట్లు మరచిపోయాను మీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు.