
శ్రావణ మాసం వచ్చిందంటే చాలు, ప్రతి ఇంటా సందడే సందడి. ముఖ్యంగా మహిళలు ఎంతో ఆతృతగా ఎదురుచూసే పండుగ వరలక్ష్మీ వ్రతం. ఈ వ్రతం ఆచరించడం వల్ల అష్టైశ్వర్యాలు, సుఖసంతోషాలు కలుగుతాయని ప్రగాఢ నమ్మకం. మరి ఈ పవిత్రమైన వరలక్ష్మీ వ్రతాన్ని ఎప్పుడు, ఎలా ఆచరించాలి? దాని ప్రాముఖ్యత ఏమిటి? తెలుసుకుందాం.
వరలక్ష్మీ వ్రతం ఎప్పుడు జరుపుకుంటారు?
సాధారణంగా శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మీ వ్రతాన్ని జరుపుకుంటారు. ఒకవేళ ఆ రోజు వీలు కాని వారు, శ్రావణ మాసంలోని మిగిలిన శుక్రవారాలలో ఏదో ఒక శుక్రవారం రోజున ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. ముఖ్యంగా సువాసినులు ఈ వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో చేసుకుంటారు.
వరలక్ష్మి వ్రత విధానం
వరలక్ష్మీ వ్రతం ఎలా చేయాలి అనే విషయాన్ని సాక్షాత్ పరమేశ్వరుడే పార్వతీదేవికి వివరించారు. ఆ విధానాన్ని ఇప్పుడు తెలుసుకుందాం:
ఉదయం నుంచే శుచిగా సిద్ధం అవ్వండి
వరలక్ష్మీ వ్రతం రోజు తెల్లవారుజామునే నిద్రలేచి, తలస్నానం చేసి, శుభ్రమైన వస్త్రాలను ధరించాలి. ఇంట్లోని ఈశాన్య మూలన ఆవు పేడతో అలికి, ఒక మండపాన్ని ఏర్పాటు చేయాలి.
కలశ స్థాపన & అమ్మవారి ఆవాహన
మండపంపై కొత్త బియ్యాన్ని పోసి, మర్రి చిగుళ్లు, పంచపల్లవాలు (బిల్వం, తులసి, వేప, రావి, మామిడి ఆకులు) తో కలశాన్ని ఏర్పాటు చేయాలి. ఈ కలశంలోకి వరలక్ష్మీదేవిని ఆవాహన చేయాలి.
షోడశోపచార పూజ
సాయంకాలమున అత్యంత భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించాలి. పూజ సమయంలో ఈ శ్లోకాన్ని పఠించాలి:
శ్లో!! “పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే!
నారాయణ ప్రియే దేవి సుప్రీతా భవసర్వదా!!”
ఈ శ్లోకంతో పాటు ధ్యాన, ఆవాహనాది షోడశోపచారాలతో అమ్మవారిని పూజించాలి.
తోరబంధన మహత్యం & శ్లోకాలు
పూజానంతరం తొమ్మిది సూత్రములు కలిగిన తోరంబును మీ కుడిచేతికి కట్టుకోవాలి. తోరం కట్టుకునేటప్పుడు ఈ క్రింది శ్లోకాన్ని చదవాలి:
శ్లో!! బద్నామి దక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదం
పుత్రపౌత్రాభివృద్ధించ సౌభాగ్యం దేహిమే రమే!!
ఈ తోరం మనకు శుభాన్ని, పుత్రపౌత్రాభివృద్ధిని, సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుందని నమ్మకం.
నైవేద్యం & బ్రాహ్మణ సమారాధన
వరలక్ష్మీదేవికి రకరకాల నైవేద్యాలను సమర్పించాలి. ఆ తర్వాత మండపం చుట్టూ మూడు ప్రదక్షిణలు చేయాలి. ఈ వ్రతాన్ని శాస్త్రోక్తంగా చేయించిన బ్రాహ్మణులకు గంధపుష్పాలతో పూజించి, 12 రకాల పిండివంటలు లేదా ఏదైనా ఒక పిండివంటకాన్ని 12 సంఖ్యతో దానం చేయాలి. దక్షిణ తాంబూలాదులు సమర్పించి, నమస్కరించి, బ్రాహ్మణుని ఆశీర్వాదం పొందాలి.
ప్రసాద స్వీకరణ & ముత్తైదువులకు తాంబూలాలు
వరలక్ష్మీదేవికి నివేదించిన నైవేద్యాన్ని బంధుమిత్రులతో కలిసి భుజించాలి. అనంతరం ముత్తైదువులకు చందన తాంబూలాలు ఇవ్వాలి. తాంబూలం ఇచ్చేటప్పుడు ఈ క్రింది శ్లోకాలను చెప్పాలి:
శ్లో!! ఏవం సంపూజ్య కల్యాణీం వరలక్ష్మిం స్వశక్తితః
దాతవ్యం ద్వాదశాపూపం వాయనం హిద్విజాతయే!!
శ్లో!! ఇందిరా ప్రతిగృహ్ణతు ఇందిరావై దదాతిచ
ఇందిరా తారకో బాభ్యాం ఇందిరాయై నమోనమః !!
ఈ విధంగా వరలక్ష్మీ వ్రతాన్ని శాస్త్రోక్తముగా ఆచరించాలి.
వరలక్ష్మీ వ్రతం - ప్రదక్షిణ ప్రాముఖ్యత
వరలక్ష్మీదేవి వ్రతంలో ప్రదక్షిణకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. వ్రతం చేసేటప్పుడు వరలక్ష్మీ వ్రత పీఠ ప్రదక్షిణ చేయడానికి అనుకూలంగా ఉండేలా చూసుకోవాలి. ప్రదక్షిణ మహత్యం గురించి పండితులు చెప్పే మాటలను వినడం మరింత శ్రేయస్కరం.
వరలక్ష్మీ వ్రత కల్పము
మరింత సమాచారం కోసం, వరలక్ష్మీదేవి వ్రత కల్పము, వరలక్ష్మీ వ్రత కథ, మరియు మంత్ర భాగం అంతా ఈ క్రింద ఉన్న PDFలో అందుబాటులో ఉంది. దీనిని డౌన్‌లోడ్ చేసుకొని, వరలక్ష్మీదేవి వ్రతమును నిర్విఘ్నంగా చేసుకుంటారని ఆశిస్తున్నాము.
ప్రముఖ ప్రవచనకర్త శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు వరలక్ష్మీదేవి వ్రతం పూజా విధానం, వ్రత కల్పం గురించి చాలా అద్భుతంగా వివరించారు. ఈ సంవత్సరం వరలక్ష్మీ వ్రతాన్ని గురువుగారు చెప్పిన విధంగా జరుపుకొని, ఆ వరలక్ష్మీదేవి అనుగ్రహాన్ని మీరు, మీ కుటుంబ సభ్యులు పొందుతారని ఆశిస్తున్నాం.
ఆ వరలక్ష్మీదేవి మన అందరికీ ఆయురారోగ్యాలు, భోగభాగ్యాలు ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాము.






